బాలశిక్షణ, 'బాల శిక్షణాలయం' లేదా 'బాల్యవిద్య' అని కూడా పిలుస్తారు, ఇది మీ పిల్లల అభివృద్ధి మరియు అభ్యాసంలో ముఖ్యమైన భాగం. 3 సంవత్సరాల వయస్సులో నాణ్యమైన కిండర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం వలన వారు జీవితంలో మరియు పాఠశాలలో బాగా రాణించడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
మీరు మీ బిడ్డ పుట్టిన తేదీని, స్టార్టింగ్ ఏజ్ కాలిక్యులేటర్లో పెట్టి, మూడు మరియు నాలుగేండ్ల బాలల కిండర్ ని మీ బిడ్డ ఏ సంవత్సరం ప్రారంభించవచ్చో తెలుసుకో వచ్చు.
ప్రీ-ప్రిప్ త్వరలో వస్తుంది
2025 నుండి నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ ప్రీ-ప్రిప్ గా మారుతోంది.
2026 లో, ప్రతి వారం ఈ క్రిందనుదహరించిన పిల్లలకు 25 గంటల వరకు ప్రీ-ప్రిపరేషన్ అందుబాటులో ఉంటుంది:
- శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినవారు
- ఎబొరిజినల్ లేదా టొర్రిస్ స్త్రైట్ ఐలాండర్ గా గుర్తించిన వారు
- వారి కుటుంబానికి బాలల రక్షణతో సంబంధాలు వున్న వారు.
నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ కోసం అందించే ప్రోగ్రామ్ మరియు ప్రీ-ప్రిప్ మధ్య ఎటువంటి తేడా లేదు. ప్రీ-ప్రిప్ పిల్లలకు ఆట ద్వారా నేర్చుకోవడానికి మరియు సంఘజీవనానికి ఎక్కువ గంటలను అందిస్తుంది. ప్రీ-ప్రిప్ స్వతంత్ర (సెషనల్) కిండర్ గార్టెన్లు మరియు లాంగ్ డే కేర్ సెంటర్ల ద్వారా అందించబడుతుంది.
ప్రీ-ప్రిప్ మరియు మూడేళ్ల కిండర్ రెండూ ఉచిత కిండర్‌లో భాగం. ఉచిత కిండర్ గురించి మరింత తెలుసుకోండి.
బాల శిక్షణాలయం సమయం
నిధులతో కూడిన మూడు సంవత్సరాల కిండర్ గార్టెన్ కార్యక్రమాలు వారానికి 5 నుండి 15 గంటలు అందుబాటులో ఉంటాయి. నిధులతో కూడిన నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ కార్యక్రమాలు వారానికి 15 గంటలు అందుబాటులో ఉంటాయి. ప్రీ-ప్రిప్ ప్రోగ్రామ్‌లు 2026 నుండి క్రమంగా 25 గంటలకు మరియు 2028 నుండి 30 గంటలకు పెరుగుతాయి.
నిరూపితమైన ఫలితాలు
బాల శిక్షణా కార్యక్రమానికి వెళ్ళే బాలలు, అక్షరాలు మరియు సంఖ్య లను ఎలా గుర్తించాలి, ఎలా లెక్కించాలి మరియు సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ బిడ్డ, తన ఆత్మవిశ్వాసాన్ని మరియు స్వతంత్రతను బాలశిక్షణ కేంద్రం వద్ద పెంపొందించుకుంటారు. సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. వారు సామాజిక చైతన్యాన్ని మరియు కొత్త స్నేహితులను పొందుతారు.
16 సంవత్సరాల వయస్సులో, పాఠశాల ప్రారంభించే ముందు 2 లేదా 3 సంవత్సరాలు కిండర్ ప్రోగ్రామ్‌లో హాజరైన విద్యార్థులు ఆంగ్లము మరియు గణితంలో హాజరు కాని వారి కంటే ఎక్కువ ఫలితాలను కలిగి ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
తల్లిదండ్రులు మరియు బాలశిక్షణ అధ్యాపకులు ఏవిధంగా కలిసి పనిచేస్తారు
తల్లిదండ్రులు/సంరక్షకులు, కుటుంబాలు మరియు ఉపాధ్యాయుల మధ్య భాగస్వామ్యంతో బాలశిక్షణ ఉత్తమంగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు/సంరక్షకులుగా, మీ బిడ్డ ఎదుగుదలలో మీరు అత్యంత ముఖ్యమైన భాగం. మీరు వారికి తప్పు మరియు ఒప్పుల గురించి, మీ భాషలు, సంస్కృతి, దయ మరియు గౌరవం వంటి విలువలను బోధిస్తారు. ఉపాధ్యాయులు, బాలశిక్షణ కేంద్రంలో ఏమి జరుగుతోంది మరియు మీ బిడ్డ ఇంట్లో నేర్చుకుంటూ వుండటానికి సహాయపడే మార్గాల గురించి, మీతో మాట్లాడతారు. వారు, మీ బిడ్డ ఆశక్తుల గురించి మరియు మీ బిడ్డ ఎలా నేర్చుకోవడానికి ఇష్టపడతారో తెలుసుకోవాలని కోరుకుంటారు.
ఏ సమయంలోనైనా ఒక అనువాదకుని ఏర్పాటు చేయమని మీరు మీ బాలశిక్షణ ఉపాధ్యాయుని అడగవచ్చు. ఇది ప్రత్యక్షంగా కాని లేదా టెలిఫోన్ ద్వారా కాని లేదా వీడియో ద్వారా ఉండవచ్చు. ఈసేవను పొందటానికి కుటుంబాలకు ఎలాంటి ఖర్చు ఉండదు.
బాలశిక్షణ కేంద్రం వద్ద ఏమి జరుగుతుంది
ఆటల ద్వారా పిల్లలనునేర్చుకోవడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. కార్యకలాపాలలో, బొమ్మలు గీయటం, పాడటం, ఎక్కటం, త్రవ్వటం, ఆరుబయట పరిగెత్తటం, బొమ్మలతో ఆడుకోవటం మరియు పుస్తకాలు చదవడం వంటివి ఉండవచ్చు. ఇతరులతో పంచుకోవడం మరియు వంతుల వారీగా సహకరించడం ద్వారా, పిల్ల లు వారి ఊహాశక్తిని ఉపయోగించుకోవటానికి మరియు కొత్తవి కనుక్కోవటానికి ఆటలు ప్రోత్సహిస్తాయి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి మరియు అర్థం చేసుకోవాలి అనే దానితో సహా, బాలలు ధ్వనులు, పదాలు మరియు భాష గురించి నేర్చుకుంటారు.
బాలశిక్షణ మన బహుళ సాంస్కృతిక సమాజంలో భాగం
బాలశిక్షణ కార్యక్రమాలు, అన్ని నేపథ్యాల నుంచి వచ్చిన తల్లిదండ్రులను వారి సంఘంలో భాగం కావడానికి స్వాగతిస్తాయి. ఆ ప్రదేశంలో తల్లిదండ్రులు కలుసుకోవచ్చు, కథలను పంచుకోవచ్చు మరియు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు.
ఉపాధ్యాయులు, మీ బిడ్డ మరియు మీ సంస్కృతి గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇది వారికి, సాంస్కృతిక పర్వదినాలు మరియు సంఘటనల ఆధారంగా మీ బిడ్డకు అర్థవంతమైన కార్యకలాపాలను తయారు చేయడానికి మరియు విక్టోరియాలోని వైవిధ్యాన్ని సంబరంగా జరుపుకోవటానికి సహాయపడుతుంది.
ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరినీ కార్యకలాపాలలో చేర్చుకుంటారు. అందువలన, ఇంగ్లీష్ మాట్లాడని బాలలు మిగిలిన వారి వలే ఆడుకోవటానికి మరియు నేర్చుకోవటానికి సమాన అవకాశాలను కలిగి ఉంటారు. కొన్ని కిండర్ కార్యక్రమాలు ఇంగ్లిష్ మాట్లాడని, లేదా తక్కువగా మాట్లాడే బాలలకుసహాయపడే ద్విభాషా విద్యావేత్తలను కలిగి ఉంటాయి. బాలలకు, ఇతరులతో కలిసి మెలగడం, వారిని అంగీకరించటం మరియు సాంస్కృతిక భేదాలను గౌరవించటం కూడా బోధిస్తారు.
కిండర్ ప్రోగ్రామ్‌ల రకాలు
పిల్లలు మూడేళ్ల కిండర్ గార్టెన్ కార్యక్రమానికి లాంగ్ డే కేర్ (దీనిని చైల్డ్ కేర్ అని కూడా పిలుస్తారు) సెంటర్‌లో లేదా స్వతంత్ర (దీనిని సెషనల్ అని కూడా పిలుస్తారు) కిండర్ సర్వీస్‌లో హాజరు కావచ్చు. ఈ సేవలు సాధారణంగా నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ కార్యక్రమాన్ని కూడా అందిస్తాయి.
దీర్ఘ కాల పగటి సంరక్షణ కేంద్రం, బాలశిక్షణ కార్యక్రమం తో పాటు పూర్తి రోజు విద్య మరియు సంరక్షణను అందించగలదు. ఉపాధ్యాయుల నేతృత్వంలోని బాలశిక్షణ కార్యక్రమాన్ని అదనపు గంటల విద్య మరియు సంరక్షణతో అనుసంధానించవచ్చు.
స్వతంత్ర బాలశిక్షణా కేంద్రంలో, బాల శిక్షణ కార్యక్రమం నిర్దిష్ట రోజులలో మరియు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పనిచేస్తుంది. స్వతంత్ర బాలశిక్షణా కేంద్రం సాధారణంగా పాఠశాల పనిచేసే సమయంలో సంవత్సరానికి 40 వారాల పాటు పని చేస్తుంది మరియు పాఠశాల సెలవుల సమయంలో అదికూడా సెలవులు తీసుకుంటుంది. ఈ రోజులు మరియు గంటలు బాల శిక్షణా కేంద్రం నిర్ణయిస్తుంది.
Updated